పేరుకే పీజీఆర్‌ఎస్‌.. పరిష్కారం కాని సమస్యలు

  • నాలుగు నెలలుగా జీతాలు లేవంటున్న ఓటీ టెక్నీషియన్లు
  • ఓటీ టెక్నీషియన్ల ఆవేదన
  • నిధి పోర్టల్‌లో పోస్టుల మ్యాపింగ్ వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి

బాపట్ల, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కేవలం పేరుకే పరిమితమైందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆపరేషన్ థియేటర్ (ఓటీ) టెక్నీషియన్లు ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తమ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదని వారు తెలిపారు. నిధి పోర్టల్‌లో తమ పోస్టులు మ్యాపింగ్ కాకపోవడంతో గత నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని వాపోయారు.

సంబంధిత శాఖలు సమస్యను పరిష్కరించకుండా, పరిష్కరించినట్లు నివేదికలు సమర్పించడం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నామని చెప్పారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాల్సిన వ్యవస్థ ఈ విధంగా పనిచేయడం బాధాకరమని పేర్కొన్నారు.

నిధి పోర్టల్‌లో ఓటీ టెక్నీషియన్ పోస్టులను వెంటనే మ్యాపింగ్ చేసి, పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరారు. అలాగే పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేసిన తమ ఫిర్యాదును మరోసారి సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.