44వ మహానాడు ఉత్సవాలు ఘనారంభం
44వ మహానాడు ఉత్సవాలు ఘనారంభం
వర్చువల్ విధానంలో పండుగ వాతావరణంలో మహానాడు ప్రారంభం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించాయి.
పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్‌లో తొలి రోజు నిర్వహించిన వర్చువల్ మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో సాగాయి. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ కమ్మరి పార్వతమ్మ, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప, టిడిపి కన్వీనర్ బోయ రామాంజనేయులు తదితరులు హాజరయ్యారు.
అదేవిధంగా కొత్తచెరువు ఎస్‌వీ ఫంక్షన్ హాల్, షాదీ ఖానా, పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టపర్తి రూరల్ క్లస్టర్ మహానాడు కార్యక్రమాలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని మొత్తం 11 క్లస్టర్లలో వర్చువల్ రూపంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సాయి ఆరామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, అబ్జర్వర్ కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.
కదిరి పట్టణంలో పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హిందూపురం, మడకశిర, పెనుకొండ తదితర నియోజకవర్గాల్లో కూడా మహానాడు వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
వర్చువల్ మహానాడు వేదికల వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు ఇతర ముఖ్య నేతల ప్రసంగాలను పార్టీ శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు. మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రధాన వేదిక నుంచి ప్రసారమైన ప్రసంగాలను నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తిలకిస్తూ పార్టీ పట్ల తమ ఐక్యతను చాటుకున్నారు.
