వెలగపూడి – రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నూతన ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంపై లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“ఇవాళ నాకు, నా కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజుగా నిలిచిపోతుంది. కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలో మా కొత్త ఇంటి నిర్మాణానికి మా నాన్న చంద్రబాబు గారు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంగా, కృతజ్ఞతా భావంతో వీక్షించాను. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాన్న ఊహించిన ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్న కలకు ఇది పునరుజ్జీవనం.
ఈ పవిత్రమైన కార్యక్రమంలో నా తల్లి భువనేశ్వరి, నా శక్తికి మూలస్తంభం నారా బ్రాహ్మణి, నా ముద్దుల కుమారుడు దేవాన్ష్ తో కలిసి పాల్గొనడం ఒక దీవెన వంటిది. ఇది మా ఇల్లు మాత్రమే కాదు… మా నిబద్ధతకు ప్రతీక. అమరావతిని మర్చిపోలేదు… దీన్ని మరింత బలంగా, మరింత పట్టుదలతో, ఎన్నడూ లేనంత మరింత అందంగా పునర్ నిర్మిస్తున్నాం. మన రాజధాని మళ్లీ పునరుజ్జీవం పొందుతోంది… అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కూడా దూసుకుపోతోంది” అంటూ లోకేశ్ పేర్కొన్నారు.