అమరావతి పోరాటం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర
- విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
- కేంద్ర మంత్రి మోహన్‌లాల్ ఖట్టర్‌కు ‘అమరావతి’ కాఫీ టేబుల్ బుక్ అందజేత
- అమరావతి పుస్తకం కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరునామా
- రైతుల 1,631 రోజుల ఉద్యమం, రాజధాని పునరుద్ధరణ చరిత్రను ప్రతిబింబించిన గ్రంథం
- ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి
ఆంధ్రప్రభ, విజయవాడ: అమరావతి పోరాటం ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, రైతుల ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పాన్ని దేశానికి చాటే చారిత్రక గ్రంథంగా రూపొందించిన “అమరావతి: ప్రజలచే నిర్మించబడింది… విధిచే రక్షించబడింది” కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మోహన్‌లాల్ ఖట్టర్‌కు ఏపీ కూటమి ఎంపీల బృందం బుధవారం అందజేసింది. ఈ బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, “అమరావతి పోరాటం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర. అమరావతి ఒక పుస్తకం కాదు… ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరునామా” అని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు–మహిళలు సాగించిన 1,631 రోజుల ఉద్యమం, 2024 జూన్ 2న అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక నిర్ణయం వంటి కీలక ఘట్టాలను ఈ గ్రంథం సజీవంగా ఆవిష్కరించిందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా, సంపద సృష్టి, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చిన్ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను జాతీయ నాయకత్వానికి చేరవేయడంలో ఇటువంటి ప్రచురణలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం విజయవాడ ప్రాంతానికి సంబంధించిన పలు అభివృద్ధి, మౌలిక వసతుల అంశాలను కేంద్ర మంత్రి మోహన్‌లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చిన్ని తెలిపారు.
