సర్వీస్ రోడ్డుకు మరమ్మతులు చేయించిన ఎస్సై
జేసీబీ సాయంతో గుంతలు పూడ్చివేత..
ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించే చర్యలు
బాలానగర్, ఆంధ్రప్రభ: బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి సమీప సర్వీస్ రోడ్డుకు బాలానగర్ ఎస్సై నరేందర్ రెడ్డి మరమ్మతులు చేయించారు.
గత రెండు సంవత్సరాలుగా బ్రిడ్జి వరకు వాహనాల రాకపోకలు సాగిస్తున్న సర్వీస్ రోడ్డుపై వర్షాలకు గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్సై నరేందర్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని జేసీబీ సహాయంతో గుంతల్లో మొరం పోయించి రోడ్డును చదును చేయించారు.
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
సర్వీస్ రోడ్డుకు మరమ్మతులు చేయించడం వల్ల కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు మరమ్మతు పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఎస్సై నరేందర్ రెడ్డిని స్థానిక ప్రజలు, నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై నరేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
