ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న మహిళా భక్తులు..
17వ రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన సారె బృందాలు
సాయంత్రం 5 గంటలకే 39 బృందాలు..
16,976 మంది భక్తుల సారె సమర్పణ
ఉచిత దర్శనం, అమ్మవారి ఆశీర్వచనంతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ సారె మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 17వ రోజు శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 39 సారె బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆయా బృందాల్లో మొత్తం 16,976 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారె బృందాలకు దేవస్థానం ప్రత్యేకంగా ఉచిత దర్శనం, అమ్మవారి ఆశీర్వచన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించింది. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి రోజూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తూ, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం, సారె సమర్పణ పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టింది.

