Ap-Rbsk-2-0-Launch : ఏపీలో RBSK 2.0 శ్రీకారం Andhra Prabha Top News
Ap-Rbsk-2-0-Launch : ఏపీలో RBSK 2.0 శ్రీకారం Andhra Prabha Top News
- దేశంలోనే తొలి పథకం షురూ
- 62.65 లక్షల మందికి టెస్టులు
- 38 రకాల రుగ్మతలకు పరీక్షలు
- 43.30 లక్షల మందికి కoటి పరీక్షలు
- 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లజోళ్లు
- మంత్రి సత్యకుమార్ వెల్లడి .

( ఆంధ్రప్రభ, రంపచోడవరం)
ప్రారంభ దశలోనే చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద సమగ్ర ఆరోగ్య పరీక్షలకు కూటమి ప్రభుత్వం
శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పోలవరం జిల్లా నుంచి RBSK 2.0 కు శ్రీకారం చుట్టింది. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ముసురుమిల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య పరీక్షల ప్రారంభ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి విద్యార్థులతో వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పాఠశాలల వరకు ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్న దే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలరని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు. అందుకే పిల్లలకు అనారోగ్యం వచ్చిన తర్వాత వైద్యం చేయడం మాత్రమే కాకుండా, సమస్యలను ముందుగానే గుర్తించి నివారించే విధానానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని గిరిజన పిల్లలు అధికంగా ఉన్న రంపచోడవరం ప్రాంతం నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలే ప్రజలకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. జిల్లాలో వైద్యుల ఖాళీలను భర్తీ చేసే దిశగా కేవలం మూడు నెలల్లో 12 మంది వైద్యులను కేటాయించడంతో పీహెచ్‌సీలలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని చెప్పారు. నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఈ ఏడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం-2.0 కింద 62,65,410 మంది చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వీరిలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆరేళ్లలోపు చిన్నారులు 20,95,129 మంది, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న ఆరు నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు 41,70,281 మంది ఉన్నారని వివరించారు.
Ap-Rbsk-2-0-Launch : జీవనశైలికి అనుగుణంగా పరీక్షలు

పుట్టుకతో వచ్చే లోపాలు, వివిధ వ్యాధులు, పోషకాహార లోపాలు, శారీరక–మానసిక ఎదుగుదలలో ఆలస్యం సహా 38 రకాల ఆరోగ్య సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తిస్తామన్నారు. జీవనశైలి విధానంలో వస్తున్న మార్పులకు తగ్గట్లు గతంలో ఉన్న పరీక్షలకు ఆదనంగా చిన్నారులకు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, మూత్రపిండాలు–మూత్రనాళ సమస్యలు, మానసిక ఇబ్బందులు, అధిక సెల్ ఫోన్ వినియోగం, నిద్రకు సంబంధించిన సమస్యలపైనా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. పిల్లల్లో సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులభంగా చికిత్స చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, పెదవి–అంగిలి చీలిక, కాళ్లలో పుట్టుకతో వచ్చే లోపాలు, నాడీ సంబంధిత సమస్యలు వంటివి చిన్న వయసులోనే గుర్తించి వైద్యం అందిస్తే భవిష్యత్తులో అంగవైకల్యం సహా అనేక సమస్యలను నివారించవచ్చన్నారు.
Ap-Rbsk-2-0-Launch : గుర్తింపుతో ఆగకుండా చికిత్స వరకు…!
ఆరోగ్య పరీక్షల్లో సమస్య బయటపడిన చిన్నారులను సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా స్థాయి చిన్నారుల చికిత్స కేంద్రాలు, అవసరమైతే ఉన్నత వైద్య సంస్థలకు పంపించి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యాధిని గుర్తించి పంపించడంతో బాధ్యత ముగిసినట్లు భావించకుండా, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి చిన్నారినీ పర్యవేక్షించాలనే స్పష్టమైన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో ఇందుకోసం 34 జిల్లా స్థాయి చిన్నారుల చికిత్స కేంద్రాలు పనిచేస్తున్నాయని, గత రెండేళ్లలో వీటి ద్వారా దాదాపు 4.85 లక్షల మంది చిన్నారులకు వైద్య సేవలు అందాయని చెప్పారు. చికిత్స అవసరమైన పిల్లలను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహన సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. గత రెండేళ్లలో బాల ఆరోగ్య కార్యక్రమం కింద 3,214 శస్త్రచికిత్సలు నిర్వహించామని, శస్త్రచికిత్సలు, నులిపురుగుల నివారణ, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది సేవలు తదితరాల కోసం కలిపి సుమారు రూ.25.78 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
.
Ap-Rbsk-2-0-Launch : 43.30 లక్షల మందికి కంటి పరీక్షలు

పిల్లల్లో చూపు సమస్యలను కూడా ముందుగానే గుర్తించేందుకు ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వారిలో చూపు సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సతో పాటు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించిందన్నారు. తమకు చూపు సరిగా లేదనే విషయాన్ని చాలామంది పిల్లలు బయటకు చెప్పుకోలేరని మంత్రి పేర్కొన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోర్డుపై రాసినది కనిపించకపోవడంతో చదువులో వెనుకబడే పరిస్థితి ఏర్పడవచ్చన్నారు. అలాంటి పిల్లలను చదువులో బలహీనులుగా భావించే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. అందుకే పాఠశాలకే వైద్య బృందాలను పంపించి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించడం ద్వారా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కిశోర దశలో పిల్లలు శారీరక మార్పులతో పాటు మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారని మంత్రి తెలిపారు. కొన్ని విషయాలను తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు చెప్పేందుకు సంకోచిస్తారని, సమస్యలను లోలోపలే దాచుకోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారికి దగ్గరగా ఉండే తోటి విద్యార్థులే మొదటి భరోసాగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ కిశోర స్వాస్థ్య కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,317 కిశోర మైత్రి ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, 61,556 మంది తోటి విద్యార్థి మార్గదర్శకులను సిద్ధం చేశామని తెలిపారు. \ముఖ్యంగా కిశోర బాలికలు రుతుస్రావం, వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడేందుకు సంకోచించకూడదన్నారు. మానసిక సమస్యలను కూడా సాధారణ ఆరోగ్య సమస్యల మాదిరిగానే చూడాలని, ఎవరేమనుకుంటారోననే భయంతో వాటిని దాచుకోవద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు.
Ap-Rbsk-2-0-Launch : పిల్లల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పిల్లల ఆరోగ్యమే వారి చదువుకు, కుటుంబాల ఆనందానికి, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది. ఏ చిన్నారి కూడా ఆరోగ్య సమస్య కారణంగా చదువుకు, ఎదుగుదలకు దూరం కాకూడదు. పరీక్షలో సమస్య గుర్తించిన ప్రతి చిన్నారికి పూర్తిస్థాయి వైద్యం అందే వరకు ఆరోగ్య శాఖ బాధ్యత తీసుకోవాలి” అని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంత్రి తన ప్రసంగంలో కలెక్టర్ దినేష్ కుమార్ పరిపాలన సామర్థ్యం గురించి అభినందించారు.
Ap-Rbsk-2-0-Launch : జీరో వేకేన్సీపాలసీతోనే..
పోలవరం జిల్లా కలెక్టర్ కె . దినేష్ కుమార్ మాట్లాడుతూ జీరో వేకెన్సీ పాలసీ వల్ల పోలవరం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులోకి వచ్చారని చెప్పారు. గిరిజనులకు వైద్య సేవలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ జె.విజయలక్ష్మి, పోలవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.సరిత, ఎమ్మెల్యే మిరియాల శిరీష, ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జి రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు , విద్యార్థులు పాల్గొన్నారు.
