సేత్వాజీగూడ వంతెనను పరిశీలించిన ఏఎస్పీ
వరద సమయంలో వంతెన దాటొద్దని ప్రజలకు సూచన
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమీపంలోని సేత్వాజీ వాగుపై ఉన్న వంతెనను గురువారం ఆదిలాబాద్ ఏఎస్పీ సత్పీక్ పరిశీలించారు. వర్షాకాలంలో వంతెనపై వరద నీరు ప్రవహించి రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితిని సమీక్షించారు.
ప్రతి వర్షాకాలంలో ఈ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఏఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వంతెనపై ఆధారపడి దాదాపు 10 నుంచి 15 గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.
వరద ఉద్ధృతి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెన దాటే ప్రయత్నం చేయవద్దని ఏఎస్పీ ప్రజలకు సూచించారు. ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితుల్లో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పీఎస్ఐ ఈసాయన్న, స్థానిక సర్పంచ్ రాథోడ్ మోహన్‌సింగ్, పోలీసు సిబ్బంది వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించారు. వరద సమయంలో వంతెన దాటేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అడ్డుకున్నారు.
పరిస్థితి సురక్షితంగా మారిన తర్వాతే ప్రయాణాలు కొనసాగించాలని ప్రజలకు సూచించారు.
