తెలంగాణ రక్షణ సేన బలోపేతమే లక్ష్యం
మహబూబాబాద్ పార్లమెంట్‌లో పార్టీని అగ్రస్థానంలో నిలబెడతాం:
డా. బోడ అనిల్ కుమార్ నాయక్
నర్సంపేట, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ రక్షణ సేనను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ బాధ్యుడు డా. బోడ అనిల్ కుమార్ నాయక్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ బలోపేతానికి పునాది అని పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
గత ఐదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తనకు 2024 మహబూబాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సుమారు 7 వేల ఓట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
ప్రజలతో తనకున్న అనుబంధం, సేవా కార్యక్రమాలను గుర్తించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనకు మహబూబాబాద్ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారని, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం, ములుగు నియోజకవర్గాల్లో పార్టీని గ్రామ, మండల, బూత్ స్థాయిల్లో బలోపేతం చేస్తామని వెల్లడించారు.
యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులను పార్టీలో భాగస్వామ్యం చేసి విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ప్రతి గ్రామంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసి కొత్త నాయకత్వాన్ని తయారు చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతం కేవలం సభ్యత్వ నమోదుతో పూర్తికాదని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచి ప్రతి కార్యకర్తను పార్టీకి బలమైన రాయబారిగా తీర్చిదిద్దుతామని డా. బోడ అనిల్ కుమార్ నాయక్ తెలిపారు.
తెలంగాణలో రాజకీయ మార్పు కోరుకునే అన్ని వర్గాల ప్రజలను కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ రక్షణ సేనను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
