నవకల్పనలకు వేదికగా ‘ఎమ్‌ఆర్‌ హబ్ స్టార్ట్ అప్ 2026’

నవకల్పనలకు వేదికగా ‘ఎమ్‌ఆర్‌ హబ్ స్టార్ట్ అప్ 2026’

  • ప్రారంభించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

మేడ్చల్, ఆంధ్రప్రభ : యువత కేవలం ఉద్యోగాలు సాధించడమే కాకుండా, సరికొత్త ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్ మైసమ్మగూడలో గల మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన “MR హబ్ స్టార్ట్ అప్ 2026” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ హబ్‌ను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ. మల్లారెడ్డి విద్యాసంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి, వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రాధాన్యతనిస్తాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను యువత అందుపుచ్చుకోవాలని, నూతన స్టార్టప్‌ల స్థాపన ద్వారా దేశ ప్రగతికి భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సరికొత్త ఐడియాలను, ప్రాజెక్టులను వాణిజ్యపరమైన వ్యాపారాలుగా మార్చేందుకు ఈ “MR హబ్” అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ స్టార్టప్ హబ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన మెంటార్‌షిప్, ల్యాబ్ వసతులు, సాంకేతిక సహకారం నిధుల అనుసంధానం వంటి సౌకర్యాలు లభిస్తాయని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, వర్సిటీ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్లు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపకుల పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు స్టార్టప్ నమూనాలను, ఆవిష్కరణలను ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తిగా తిలకించి, వారిని అభినందించారు.