telangana |కాలుష్య రహిత హైదరాబాద్‌ లక్ష్యం : సీఎం రేవంత్

telangana |కాలుష్య రహిత హైదరాబాద్‌ లక్ష్యం : సీఎం రేవంత్

ఓఆర్ఆర్‌ లోపల గ్రీన్‌ అర్బన్‌ సిటీగా అభివృద్ధి
ఓఆర్ఆర్‌ లోపల పరిశ్రమల కాలుష్యానికి చెక్‌..
బయట మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధం
రంగారెడ్డిలో 5.6 గిగావాట్ల ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సోలార్‌ యూనిట్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. 2,100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఓఆర్ఆర్ పరిధిలోని సుమారు 1.35 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ నగరాభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యమున్న సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సంస్థ రూపొందించిన సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ వ్యవస్థతో కూడిన ‘ఆక్సీ ట్రీ’తో పాటు సోలార్ మాడ్యూల్ తయారీ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల కాలుష్యం, మూసీ నది కాలుష్యం నగరవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఓఆర్ఆర్ లోపలి కోర్ అర్బన్ ప్రాంతాన్ని కాలుష్యరహిత మండలంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేసిన పెరి అర్బన్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌లకు తరలించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తరలించే పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పెరి అర్బన్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో తొలి పరిశ్రమగా ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ ప్రారంభం కావడం అభినందనీయమని పేర్కొన్న సీఎం, కేవలం 12 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.

‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యంతో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తూ 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీ వంటి సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలంటే మరిన్ని పెట్టుబడులు, ఆధునిక పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన సోలార్ ఆధారిత ‘ఆక్సీ ట్రీ’ వంటి వినూత్న ఆవిష్కరణలు అభినందనీయమని చెప్పారు. ప్రకృతి పరిరక్షణలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యమూ ఎంతో కీలకమని ఆయన పిలుపునిచ్చారు.