ఎల్లంపల్లి ఎత్తిపోతలు కేసీఆర్ ముందుచూపు ఫలితమే: కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని వ్యాఖ్య

ధర్మారం, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జరుగుతున్న ఎత్తిపోతల పథకం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుచూపు ఫలితమేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ వద్ద మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి ఎత్తిపోతల ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 శాతం పనులు చేపట్టగా, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాన్ని పూర్తిచేసి మోటార్లు ఏర్పాటు చేయడం వల్లే ప్రస్తుతం ఎత్తిపోతలు సాగుతున్నాయని అన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాస్తవాలను గుర్తించకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో సాగు జరిగేదని, అనంతరం మరో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని పేర్కొన్నారు.

కాళేశ్వరం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా 248 టీఎంసీల నీటి సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందని, వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని, లేకపోతే ప్రజలు తగిన విధంగా స్పందిస్తారని అన్నారు.

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రికి తెలంగాణ సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తులా ఉమ, ద్యావ వసంత, నాయకులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ముత్యాలు బలరాం రెడ్డి, పూస్కూరి రామారావు, రాచూరి శ్రీధర్, కొమటి రెడ్డి బుచ్చిరెడ్డి, నేరెళ్ల చిన్న లచ్చయ్య, దేవి రమణ తదితరులు పాల్గొన్నారు.