గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాల కొరత

ఫుడ్ పాయిజన్ ఘటనపై బీఆర్ఎస్వీ ఆందోళన

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని ఎస్టీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, తగిన వైద్య సదుపాయాలు, పరిశుభ్రమైన వంటశాలలు అందించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.

ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొట్టే రాకేష్, యాసిన్, అంగూరి విజయ్, సుమంత్, అరుణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.