గ్రామంలో మద్య విక్రయాలపై కఠిన నిర్ణయం
బెల్ట్ షాపులు నిర్మూలనకు గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ వై. నర్సిములు (బాబురావు) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రామంలో మద్యం విక్రయాల కారణంగా యువత చెడు మార్గంలోకి వెళ్లడం, విద్యార్థులు చదువులకు దూరమై కుటుంబాలకు భారంగా మారుతున్నారనే అంశాన్ని గ్రామస్థులు ఇటీవల సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహిళా సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యపై చర్చించారు.
సమావేశంలో గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి వివరాలను అధికారులకు లేదా గ్రామ పెద్దలకు తెలియజేసిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
గ్రామాన్ని మద్యరహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వై. నర్సిములు (బాబురావు), ఉపసర్పంచ్ కేశవానంద్, వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
