క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘జైల్ భరో’ విజయవంతం చేయాలి
ఆగస్టు 10 కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని పిలుపు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ పిలుపునిచ్చారు.
బెల్లంపల్లి తాపీ సంఘం భవనంలో చల్లూరి దేవదాస్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు కార్మికులు, రైతులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు.
ఈ సందర్భంగా ‘జైల్ భరో’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆగస్టు 10న బెల్లంపల్లి 1 టౌన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో సింగరేణి, అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్, ఆటో యూనియన్లతో పాటు అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుమాస అశోక్, నాయకులు దాగం రాజారాం, భానుమతి, సత్యవతి, పి. రమాదేవి, భాగ్యలక్ష్మి, పద్మావతి, మంగావతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
