గందరగోళంగా కొత్త అమ్మవారి దేవస్థాన ఎన్నికల ప్రక్రియ

  • ఏకగ్రీవం పేరుతో నగరాలు సంఘం స్వంత ఎజెండా
  • నామినేషన్ ఫీజు తగ్గింపు తో ఎన్నికలు వాయిదా ప్రయత్నాలు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ చిట్టినగర్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి–మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలక మండలి సభ్యుల ఎన్నికల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నగరాల సంఘం చేపట్టిన చర్యలు సభ్యుల్లో చర్చనీయాంశంగా మారాయి.

దేవస్థానం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5న నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 6న పరిశీలన, ఆగస్టు 7న ఉపసంహరణ, ఏకగ్రీవం కాకపోతే ఆగస్టు 23న ఎన్నికలు నిర్వహించి అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ దాఖలుకు రూ.20 వేల ఫీజు, రూ.20 వేల డిపాజిట్ చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని తెలిపారు.

అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ నగరాల సంఘం ఏకగ్రీవ ఎన్నికల పేరిట ప్రత్యేక ప్రక్రియ చేపట్టడం సభ్యుల్లో సందేహాలకు తావిస్తోంది. తొలుత 36 మంది సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయిలో సభ్యులు హాజరుకాలేదని సమాచారం. అనంతరం “శ్రీ నగరాల సీతారామస్వామి–మహాలక్ష్మి అమ్మవార్ల దేవాలయం కళ్యాణ మండపాల పరిపాలన అభివృద్ధి ధార్మిక సేవా కమిటీ” పేరుతో 27 మంది సభ్యుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించారు.

ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత మళ్లీ ఏకగ్రీవ ఎంపిక ప్రక్రియ చేపట్టడంపై దేవస్థానం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి అనుకూల వ్యక్తులతోనే కమిటీని ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. సంఘం సభ్యుల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న దేవస్థానం వ్యవహారాలను సంఘం ఎలా నియంత్రిస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఆదివారం మాజీ పాలక మండలి కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు పేరిట వాట్సాప్‌లో ఒక ప్రకటన విడుదలైంది. గతంలో మూడు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో ఎన్నికలు ఆలస్యమయ్యాయని అందులో పేర్కొన్నారు. అలాగే రూ.20 వేల నామినేషన్ ఫీజు, రూ.20 వేల డిపాజిట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, తక్కువ ఖర్చుతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పరిణామాలతో దేవస్థానం పాలక మండలి ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నామినేషన్ ఫీజును తగ్గించి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని దేవస్థానం సభ్యులు కోరుతున్నారు.