పవన్‌పై దూషణలు చేస్తే వెంటనే కేసులు..
కార్యకర్తలకు న్యాయ అండ: పిడుగు హరిప్రసాద్
తాడేపల్లి,ఆంధ్రప్రభ: న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థవంతంగా ముందుకు సాగలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల ప్రక్రియ, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో జనసేన పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల హైకోర్టు న్యాయవాదుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదుల బాధ్యతలు, కొత్త న్యాయవాదులను పార్టీ లీగల్ సెల్‌లోకి ఆహ్వానించడం, కార్యకర్తలపై గత ప్రభుత్వంలో నమోదైన కేసుల పరిష్కారం, జనవాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలు గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షసాధింపుతో అనేక తప్పుడు కేసులను ఎదుర్కొన్నారని అన్నారు. ఆ కేసుల కారణంగా పలువురు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే రెండుసార్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఏ కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏ చర్యలు అవసరమో అధ్యయనం చేశారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ కార్యకర్తల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన అన్ని కేసుల పూర్తి వివరాలను సేకరించాలని హరిప్రసాద్ సూచించారు. కేసుల సంఖ్య, ప్రస్తుత స్థితి, ఏ కోర్టులో విచారణ జరుగుతోంది, ఏ విధమైన న్యాయ సహాయం అవసరమో జిల్లా వారీగా సమగ్ర నివేదిక రూపొందించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. దీంతో కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని, పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు న్యాయపరంగా అండగా నిలవొచ్చని చెప్పారు.
కాకినాడలో పవన్ కల్యాణ్‌ను దూషించిన ఘటనపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలపై నమోదైన కేసులను ఆయన ప్రస్తావించారు. అలాగే విశాఖ నోవాటెల్ ఘటనలో సంఘటన స్థలంలో లేకపోయినా అనుమానాల ఆధారంగా పలువురిపై కేసులు నమోదు చేసి 18 మందిని సెంట్రల్ జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి కేసుల కారణంగా అనేక మంది కార్యకర్తలు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తూ సమయం, ధనం, మానసిక ప్రశాంతత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసుల పరిష్కారానికి చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని న్యాయవాదులకు సూచించారు. కేసులపై విలువైన సూచనలు, సలహాలు అందించి పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు.
న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని హరిప్రసాద్ అన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థికి అవసరమైన న్యాయ సహాయం అందించాలని సూచించారు. నామినేషన్ పత్రాల తయారీ, పరిశీలన, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి నామినేషన్ చెల్లుబాటు అయ్యేలా మార్గదర్శకత్వం అందించాలని చెప్పారు. గత స్థానిక సంస్థల ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇటీవలి కాలంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు పెరుగుతున్నాయని హరిప్రసాద్ అన్నారు. ఇటువంటి ఘటనలను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంతో ఇలాంటి చర్యలు జరిగాయని భావించినా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగితే చట్టం ఏమీ చేయలేదనే భావన ఏర్పడుతుందని అన్నారు.
పార్టీ నుంచి ప్రత్యేక ఆదేశాల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన, ఎవరైనా పార్టీ అధ్యక్షుడు లేదా ముఖ్య నాయకులను చట్టవిరుద్ధంగా దూషిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని సూచించారు. వర్తించే బలమైన చట్టాల ప్రకారం కేసులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుని, దూషణలకు పాల్పడే వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి కొప్పెర కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమ్మినాయుడు, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కిరణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సింగలూరి శాంతిప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

