తడిసిన ప్రతి గింజను కొనాలని …

తడిసిన ప్రతి గింజను కొనాలని …
చౌటుప్పల్ మార్కెట్ యార్డు వద్ద రైతుల ధర్నా
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : అకాల వర్షాలతో తడిసిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తూకం వేసిన ధాన్యానికి వెంటనే మిల్లులకు తరలించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు వందలాది మంది రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా, ధాన్యం తరలింపులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వందలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనకుండా అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. వేగవంతమైన తరలింపు: అధికారులు, మిల్లర్లు సమన్వయంతో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి. వసతుల కల్పన: అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన చోట అమాలీల సంఖ్యను పెంచాలి. సకాలంలో చెల్లింపులు: ధాన్యం అమ్మిన రైతులకు నగదు చెల్లింపుల్లో జాప్యం చేయకూడదు. మోసాలు అరికట్టాలి: తూకం, తాలు పేరుతో రైతులను మోసం చేసే చర్యలను అడ్డుకోవాలి.

పది రోజుల్లోగా మార్కెట్ యార్డులోని ధాన్యాన్ని తరలించకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చీర్క అలివేలు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోశిక కరుణాకర్, బండారు నరసింహ, ఆకుల ధర్మయ్య, పర్ని ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఆందోళన చేస్తున్న రైతులతో మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, మండల తహసిల్దార్ వీరాబాయి మాట్లాడి చెప్పారు ధాన్యము కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

