బ్రిడ్జి నిర్మించారు.. రోడ్డు పూర్తి చేయలేదు
వర్షాలతో బురదమయమైన మార్గం..
వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రెంకొని వాగు వద్ద నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బ్రిడ్జికి ఇరువైపులా మొరం పోసి వదిలేయడంతో పాటు తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో వర్షాలకు మార్గం బురదమయంగా మారింది. ఫలితంగా బ్రిడ్జిపైకి ఎక్కడం, దిగడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా బస్సులు, డీసీఎంలు బురదలో కూరుకుపోతుండగా, ద్విచక్ర వాహనాలు గుంతల్లో ఇరుక్కొని ప్రమాదాలకు గురవుతున్నాయి. వంతెన వద్ద ఎక్కే, దిగే మార్గంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను తరలించాల్సి వచ్చినప్పుడు ఈ మార్గంలో ప్రయాణించడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. బ్రిడ్జి వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఈ రహదారి మీదుగా మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.
ఖానాపూర్–తర్లపాడు, ఖానాపూర్–దిలావర్పూర్ మధ్య నిర్మించిన రెండు బ్రిడ్జిలకు సంబంధించిన మిగిలిన రహదారి పనులను అధికారులు వెంటనే పూర్తి చేసి, ప్రయాణికులకు సురక్షిత రాకపోకలు కల్పించాలని వాహనదారులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
