ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
జైపూర్, (ఆంధ్రప్రభ): జైపూర్ మండలం ఇందారం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరీంనగర్ రెనే హాస్పిటల్, గోదావరిఖని సింగరేణి కార్డియాక్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఫయాజుద్దీన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందారం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరంలో మొత్తం 410 మందికి రక్తపోటు, మధుమేహం, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గుండె సంబంధిత వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివ, వైద్యులు తులసిరామ్, ధర్మతేజ, సంతానం, క్రాంతికుమార్, తేజస్విని, మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, మేనేజర్లు అవినాష్, రామకృష్ణ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
