అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్
టీఆర్ఈఏ ఆధ్వర్యంలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని అవరోధాలను అధిగమించి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్ ఆకాంక్షించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సన్మాన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

టీఆర్ఈఏ బెల్లంపల్లి అధ్యక్షుడు ఎస్. లింగయ్య మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎల్లప్పుడూ సామాజిక బాధ్యతతో పనిచేస్తుందని, ప్రతిభావంతులైన మహిళామణులను గౌరవించుకోవడం తమకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం రామాయణంలోని 2800 శ్లోకాలను కేవలం 150 నిమిషాల్లో పఠించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించిన వేముల మానసను, కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన ఆమె కుమార్తెలు వెన్నెల, శ్రీ నిత్యలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయురాళ్లు కె. కళామోహిని, ఎర్ర సువర్ణ, ఎస్టీఓ కరుణలను కూడా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఈఏ బెల్లంపల్లి ప్రధాన కార్యదర్శి కె. నర్సయ్య, సభ్యులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply