ఆధునిక సాంకేతికతతో ప్రజల భద్రత..నేర నియంత్రణ..!

ఆధునిక సాంకేతికతతో ప్రజల భద్రత..నేర నియంత్రణ..!

  • ఆదిలాబాద్ లో 300 సీసీటీవీ కెమెరాలు ప్రారంభం..
  • ట్రాఫిక్ నిబంధనల అవగాహన కోసం చిల్డ్రన్ పార్క్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు శ్రీకారం..!
  • ఆదిలాబాద్ జిల్లాలో డిజిపి సివి ఆనంద్ సుడిగాలి పర్యటన..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తరిస్తున్నట్టు రాష్ట్ర నూతన డిజిపి సివి ఆనంద్ అన్నారు. బుధవారం తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ డీజీపీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఏఆర్ హెడ్ క్వార్టర్ లో డీజీపీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్నుండి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలలో 220 సీసీటీవీ కెమెరాలు గ్రామీణ ప్రాంతాలకు, 80 సీసీటీవీ కెమెరాలు పట్టణ ప్రాంతంలో వినియోగంలోకి వస్తాయన్నారు. ఈ కెమెరాల ద్వారా ప్రజల రక్షణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు వంటి అంశాలలో కీలక పాత్ర పోషించేలా దోహదం చేస్తుందన్నారు.

  • ఆధునిక సాంకేతికతో మరింత ముందుకు..!
    ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని డీజీపీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు ద్వారా చిన్నపిల్లల నుండి విద్యార్థుల వరకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెరుగుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత చర్యలకు పోలీస్ శాఖ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
  • డిజిపితో కలిసి ఏసీబి డీజి చారు సిన్హా పర్యటన..!
    అదిలాబాద్ జిల్లా పర్యటనలో డిజిపి వెంట ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా, మల్టీ జోన్ -1 ఐజి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట వినూత్నంగా ఏర్పాటుచేసిన ట్రాఫిక్ ట్రైన్ ఇన్స్టిట్యూట్ ను, ఆ తర్వాత కలెక్టరేట్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ సిస్టంను డిజిపి ప్రారంభించారు. డిజిపి వెంట, ఎస్పీ అఖిల్ మహాజన్, డి.ఎస్.పి. ఎల్. జీవన్ రెడ్డి, వన్ టౌన్ సిఐ బి. సునీల్ కుమార్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.