వరద ప్రభావిత గ్రామాల్లో ముమ్మర పారిశుద్ధ్య చర్యలు..
ఏలూరు, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు వరద ప్రభావిత గ్రామాల్లో అధికారులు ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వరద నీరు తగ్గిన అనంతరం అంటువ్యాధులు, దోమల వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నారు.
గణపవరం, అమరవరం, మారేడుబాక, కుక్కునూరు, వేలేరుపాడు, శివకాశీపురం, తోటకూరగొమ్ము, భూదేవిపేట, దాచారం, గొమ్ముగూడెం, రేపాకగొమ్ము, రుద్రంకోట తదితర గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది బ్లీచింగ్ చల్లడంతో పాటు దోమల నివారణ మందులను పిచికారీ చేశారు.

దాచారం, శివకాశీపురంలో ఏర్పాటు చేసిన వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేస్తూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అదేవిధంగా వరద సహాయక కేంద్రాలు, ప్రభావిత గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

