స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా నవీకరించేందుకు సహకరించాలి…

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా నవీకరించేందుకు సహకరించాలి…
పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి…
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష…
ఏలూరు బ్యూరో. ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లాలో ఓటరు జాబితాలను పారదర్శకంగా, దోషాలు లేకుండా నవీకరించడానికి చేపట్టిన ప్రక్రియ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) పై రాజకీయపార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో నమోదు కావడం, అదేసమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) యొక్క ప్రధాన లక్ష్యమన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) ద్వారా ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేయడం, డూప్లికేట్ పేర్లను తొలగించడం, మరియు కొత్తగా అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) లో భాగంగా జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఇంటింటా సర్వేను సర్వే నిర్వహించడం జరుగుతుందని, జూలై 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.

తదుపరి జూన్ 21వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, సెప్టెంబరు 22వ తేదీన తుది ఓటర్లు జాబితా విడుదల చేస్తారని తెలిపారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమన్నారు. ఇందుకు సంబంధించి జూన్ 05 వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఇఆర్వోస్, ఏఇఆర్వోస్, బూత్ లెవెల్ అధికార్లు, సూపర్వైజర్లు, తదితరులకు శిక్షణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) నిర్వహణకు ఏర్పాట్లు, ఫారమ్స్ శిక్షణ, ముద్రణ, తదితర కార్యక్రమాల నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 10వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకూ బూత్ లెవల్ ఏజెంట్లకు ఓరియంటేషన్ వర్కు షాపు ను నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని గుర్తింపు పొందిన పార్టీల తరపున పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ , తదితర అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సజావుగా, సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు వి. స్టాన్లీ బాబు, ఎల్. సుభాష్, రాజనాల రామమోహనరావు, నెరుసు నెలరాజు, ఏ.రతన్ కాంత్, ఆర్. లింగరాజు, డి.ఎన్ .వి.డి. ప్రసాద్, ప్రసాద్, ఎం. వెంకటనగరాజు, కలెక్టరేట్ సిబ్బంది అచ్యుత్, నాయక్, రాజేష్ పాల్గొన్నారు.
