మహనీయుల ఆశయాలతో ప్రజాసేవలో నిబద్ధత చూపాలి
- నేడు బళ్ళారి రాఘవ జయంతి
- ఏలూరు జిల్లా పోలీసుల ఘన నివాళి
ఏలూరు, ఆంధ్రప్రభ: ప్రముఖ తెలుగు నాటక రంగ మహనీయుడు బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బళ్ళారి రాఘవ చిత్రపటానికి అధికారులు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది బళ్ళారి రాఘవ జీవిత విశేషాలను స్మరించుకుంటూ తెలుగు నాటక రంగ అభివృద్ధికి ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. కళా, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, గొప్ప మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు అంకితభావంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఇలాంటి జయంతి కార్యక్రమాలు మహనీయుల సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు యువతలో స్ఫూర్తిని నింపుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం బళ్ళారి రాఘవ ఆశయాలను ఆచరిస్తూ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

