అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించిన మీడియా ప్రతినిధులు..
- కుటుంబ సమేతంగా సారెతో ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన పాత్రికేయులు
- మీడియా బృందానికి ఈవో వి.కె. సీనా నాయక్ సాదర స్వాగతం
- ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన మీడియా ప్రతినిధులు
- ‘జై దుర్గా.. జై జై దుర్గా’ నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మీడియా ప్రతినిధులు కుటుంబ సమేతంగా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.కె. సీనా నాయక్ మీడియా బృందానికి సాదర స్వాగతం పలికారు. ఆషాఢ మాస సారె ఉత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ మీడియా బృందానికి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని ఆరవ అంతస్తులో కూడా మీడియా ప్రతినిధులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల సందోహంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోగా, ‘జై దుర్గా… జై జై దుర్గా’ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో మారుమోగింది.
