అమ్మవారి దర్శనానికి వెళ్తూ విషాదం
చెల్లూరు బైపాస్‌లో లారీ ఢీకొని ముగ్గురు మృతి
మృతుల్లో 8 ఏళ్ల బాలుడు.. పలువురికి తీవ్ర గాయాలు
లారీ డ్రైవర్ పరారీ..
విజయనగరం, ఆంధ్రప్రభ: అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులను రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. విజయనగరం మండల పరిధిలోని చెల్లూరు బైపాస్ రోడ్డుపై సోమవారం రాత్రి బొలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో చింతపల్లి రాంబాబు (50), మజ్జి నారాయణరావు (50), బొత్స మోహన్ నాయుడు (8) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మజ్జిపేట గ్రామానికి చెందిన భక్తులు రాయగడలోని మజ్జి గౌరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బొలెరోలో బయలుదేరారు. మార్గమధ్యలో చెల్లూరు వద్ద మరో ముగ్గురిని ఎక్కించుకునేందుకు వాహనాన్ని బైపాస్ రోడ్డుపై నిలిపిన సమయంలో విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
