ఆధునిక హంగులతో ఊటుకూరు సహకార సంఘం కళ్యాణ మండపం
గ్రామీణ ప్రజలకు చక్కటి అవకాశం
99.49 లక్షల రూపాయలతో పునరుద్ధరణ
నేడు ఎంపి చిన్ని,కెడిసిసిబి చైర్మన్ రఘురాం,ఎస్ఓపిసిఏ చైర్మన్ దేవదత్
చేతులచే పునఃప్రారంభం
గంపలగూడెం, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో 2016లో ఊటుకూరు గ్రామంలో శ్రీ కృష్ణరాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపం పునరుద్ధరణ అనంతరం నేడు తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానుంది. విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని), జిల్లా సహకార సంఘం బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ అధారిటీ చైర్మన్ శావల దేవదత్ చేతుల మీదుగా పునరుద్ధరించిన కళ్యాణ మండపం సోమవారం ప్రారంభం కానుంది. 2015 సంవత్సరంలో డిసిఎమ్ఎస్ డైరెక్టర్ గా,సహకార సంఘం చైర్మన్ గా ఉన్న చెరుకూరి రాజేశ్వరరావు ఆలోచనతో ఒక ఎకరా 32 సెంట్ల భూమిలో కళ్యాణమండపం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శంకరయ్య జ్ఞాపకార్ధం కుమారుడు సునీల్ కుమార్ ఒక ఎకరా భూమిని దాతృత్వంతో అందజేశారు.మిగిలిన 0.32 సెంట్ల భూమి సహకార సంఘం ద్వారా కొనుగోలు చేశారు.జిల్లా సహకార సంఘం బ్యాంకు నుండి రూ.82.50 లక్షలు అప్పుగా,రూ.27.50 లక్షలు సంఘం,సభ్యుల నుండి,రూ.60 లక్షలు దాతల నుండి పొంది కళ్యాణ మండపం,వంటశాల,మరుగుదొడ్లు, శుద్ధ జల కేంద్రం,షామియానా సదుపాయాలు కల్పించి 2016,నవంబర్ 24న ప్రారంభించారు.ఆ బ్యాంకు నుండి పొందిన అప్పు రూ.82.50 లక్షలు తిరిగి చెల్లించడం కూడా జరిగింది.
ఈ కళ్యాణ మండపం గత పదేళ్లుగా వందలాది కుటుంబాల వివాహాలు,శుభకార్యాలు,సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది.ఈ నిర్మాణానికి ప్రజల సహకారం,సహకార సంఘం చొరవ కలిసివచ్చి ఈ శాశ్వత ఆస్తి రూపుదిద్దుకుంది.ప్రజలకు మరింత మెరుగైన వసతులు,ఆధునిక హంగులతో కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సహకార సంఘం చైర్మన్ రాజేశ్వరరావు,ముఖ్య కార్యనిర్వాహన అధికారి అనంత వెంకట నరసయ్య మరలా 2026లో రూ.99.49 లక్షల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు.జిల్లా సహకార సంఘం బ్యాంకు నుండి రూ.40 లక్షలు అప్పుగా,సంఘం ఫండ్ నుండి రూ.51.49 లక్షలు,రూ.8 లక్షలు ఉచిత గ్రాంట్ గా పొంది కళ్యాణ మండపానికి విస్తృతంగా మరమ్మతులు చేపట్టారు.
ఈ సందర్భంగా పూర్తిస్థాయిలో ఆధునికీకరణ పనులు నిర్వహించి 90.5 టన్నుల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షణీయమైన ఫాల్స్ సీలింగ్,200 కెవిఏ జనరేటర్ కొనుగోలు,ఆధునిక లైటింగ్, మెరుగైన అంతర్గత అలంకరణ,ఇతర మౌలిక వసతులను కల్పించారు.దీనితో కళ్యాణమండపం పట్టణ స్థాయి ఫంక్షన్ హాళ్లను తలపించేలా సరికొత్త రూపును సంతరించుకుంది.ప్రస్తుతం ఈ కళ్యాణ మండపాన్ని గ్రామం,సమీప గ్రామాల ప్రజలకు అందుబాటు ధరలో అద్దెకు అందిస్తున్నారు.ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా, సామాన్య కుటుంబాలు తమ వివాహాలు,శుభకార్యాలు, సమావేశాలు,ఇతర సామాజిక కార్యక్రమాలను తక్కువ వ్యయంతో నిర్వహించుకునే అవకాశం పొందుతున్నాయి.
ఈ మండపం ద్వారా సహకార సంఘానికి కూడా ఆదాయం సమకూరుతోంది.ఆ ఆదాయాన్ని మండపం నిర్వహణ,మరమ్మతులు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.గ్రామీణ ప్రజలకు అందుబాటు ధరలో అద్దెకు ఇస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది.
సహకార సంఘానికి ఆర్థిక వనరుగా కళ్యాణ మండపం
చెరుకూరి రాజేశ్వరరావు,సహకారం సంఘం చైర్మన్,ఊటుకూరు
సామాన్య,మధ్య తరగతి ప్రజలు శుభ,అశుభ కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇంటి వద్ద తగిన స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో సహకార సంఘం తరపున మంచి కల్యాణ మండపం నిర్మించి అందజేయాలని 2016 లో ఆలోచన చేశాము.నేడు పునరుద్ధరణ పనులు అనంతరం ఈ కళ్యాణ మండపం మరింత మంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు సిద్ధమైంది.గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలు ప్రజల అవసరాలను గుర్తించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది.ప్రజల నుండి కొంత మొత్తంలోనే అద్దె రూపంలో తీసుకుంటున్నాం.దీనితో కళ్యాణమండపం సహకార సంఘానికి మంచి ఆర్థిక వనరుగా ఉంది.
