విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రమాణాలు మెరుగుపడాలి: బొల్లం మల్లయ్య యాదవ్

నడిగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని కరివిరాల గ్రామ మోడల్ స్కూల్, హాస్టల్‌ను కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్ వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అధికారులు, సిబ్బందిని డైట్ మెనూ, పోషకాహార ప్రమాణాలు, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలుపై ప్రశ్నించి వివరాలు కోరారు.

ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులకు కలుషితమైన ఆహారం, పురుగులు ఉన్న భోజనం అందుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులు బాధాకరమని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు.

నాణ్యతలేని ఆహారం కారణంగా విద్యార్థులు వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అట్టడుగు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్‌లలో చదువుకుంటున్నారని చెప్పారు. అలాంటి విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షితమైన వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ విద్యారంగానికి తగిన నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. సరిపడా నిధులు లేకపోవడంతో నాసిరకం ఆహార పదార్థాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఆరోగ్యంగా ఉండాల్సిన విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.

కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం కనీస ప్రమాణాలను కూడా అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పరిశుభ్రత లోపించడం, తాగునీటి సమస్యలు, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న వరుస విషాద ఘటనలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు రాష్ట్ర ప్రజలను కలచివేశాయని అన్నారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా అనే భయాందోళన తల్లిదండ్రుల్లో నెలకొనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమై ఆచరణలో విఫలమైందని విమర్శించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకుని కరివిరాల మోడల్ స్కూల్‌తో పాటు కోదాడ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్‌లలో మధ్యాహ్న భోజనం, హాస్టల్ వసతి, పరిశుభ్రత, భద్రత, రవాణా, ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్య విషయంలో ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించి ప్రతి విద్యార్థికి నాణ్యమైన పౌష్టికాహారం, సురక్షితమైన వాతావరణం, మెరుగైన విద్యా ప్రమాణాలు కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.