నిధులు నిలిపివేయడం అత్యంత దారుణం : బొల్లం

కోదాడ, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్షతో నిధుల విడుదలను అడ్డుకుంటోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులతో కలిసి ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్‌లను గెలిపించినప్పటికీ, రాజకీయ కక్షసాధింపు కారణంగా ఆయా గ్రామాలకు రావాల్సిన నిధులను ప్రభుత్వం నిలిపివేయడం దురదృష్టకరమని విమర్శించారు.

గ్రామాల్లో పారిశుధ్య పనులు దెబ్బతింటున్నాయని, మురుగు కాలువలు నిండిపోతున్నాయని, తాగునీటి సమస్యలు తీవ్రతరమవుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు.

వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్లకు డీజిల్‌ వంటి కనీస అవసరాలకే నిధులు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను రాజకీయ కారణాలతో ఇబ్బందులకు గురిచేయడం గ్రామ ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు.

బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్‌లు ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నిలిచిపోయిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులకు అత్యవసరంగా నిధులు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.

రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలను సమాన దృష్టితో చూడాలని, గ్రామాల అభివృద్ధిలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌కు విన్నవించినట్లు మల్లయ్య యాదవ్ తెలిపారు.