ఎక్సైజ్ అధికారుల దాడులు.. ఇద్దరు అరెస్ట్
20 లీటర్ల నాటు సారా, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాలకీడు మండలం శూన్యంపాడు తండా, మఠంపల్లి మండలం బాడవ తండా గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 20 లీటర్ల సారా, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.
దామరచర్ల మండలం గణేష్పాడుకు చెందిన బనావత్ మంచ్య తన హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనంపై నాటు సారా తరలిస్తుండగా, ఎక్సైజ్ ఎస్ఐ దివ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద నుంచి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
అలాగే మఠంపల్లి మండలం బాడవ తండాకు చెందిన బానోత్ సైదా తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై నాటు సారాను గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామానికి తరలిస్తుండగా, ఎక్సైజ్ ఎస్ఐ వెన్నెల ఆధ్వర్యంలో వాహనాన్ని స్వాధీనం చేసుకుని 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశారు.
ఈ దాడుల్లో ఎస్ఐలు దివ్య, వెన్నెలతో పాటు సిబ్బంది సిద్ధి నాగరాజు, సుధాకర్, వెంకట విద్యాసాగర్, పుట్ట శ్రీనివాస్, డ్రైవర్ నరేష్ పాల్గొన్నారు.
