కృష్ణా డెల్టాకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి..
- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్
ఏలూరు, ఆంధ్రప్రభ : కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చవద్దని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు శివారు సుంకరివారి తోట వంతెన వద్ద రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉండి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. జూన్ 15 నుంచి సాగునీరు విడుదల చేస్తామని చెప్పి రైతులతో నారుమళ్లు వేయించి, ఇప్పుడు వరి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేయడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు.
కృష్ణా డెల్టా పరిధిలో ఖరీఫ్ సీజన్‌లోనే వరి సాగు సాధ్యమవుతుందని, రబీ కాలంలో ఇప్పటికే ఆరుతడి పంటలకే పరిమితమవుతున్న రైతులను మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. సాగునీరు లేకపోతే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పట్టిసీమ, పులిచింతల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఏలూరు మండలంలోని సుమారు 10 వేల ఎకరాలకు పొణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలను అందించడంలో జలవనరుల శాఖ వైఫల్యంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ నీటిని సముద్రంలోకి వదిలేస్తూ రైతులకు సాగునీరు అందించకపోవడం బాధాకరమన్నారు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టి నారుమళ్లు వేసి, కొన్నిచోట్ల నాట్లు కూడా పూర్తి చేశారని తెలిపారు. అందువల్ల కృష్ణా ఈస్ట్ కెనాల్‌కు వెంటనే సాగునీరు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ఎదుట రైతులు భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించకపోతే రోడ్ల దిగ్బంధన కార్యక్రమాలు చేపడతామని రైతు సంఘం హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాసరావు, దాసరి నాగేశ్వరరావు, నల్లూరి సుబ్బారావు, తలారి జయరాజు, బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, తిరుమలశెట్టి జగదీష్, పైడిపాటి భాస్కరరావు, పుట్టి దుర్గాప్రసాద్, పంది వెంకటేశ్వరరావు, శలా సూరిబాబు, బల్లవరపు రాంబాబు తదితర రైతు నాయకులు పాల్గొన్నారు.
