సంగీతానికి ఉన్న శక్తి అపారమైనది
పాట సమాజాన్ని ఏకం చేసే గొప్ప సాధనం: డీసీపీ దారా కవిత
వడ్డేపల్లి, ఆంధ్రప్రభ : సంగీతానికి ఉన్న శక్తి అపారమైనదని సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత అన్నారు. శనివారం రాత్రి హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ‘ఓరుగల్లులో స్వరాభిషేకం’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ఖాదీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశంను శాలువా కప్పి, గజమాలతో సన్మానించి విశిష్ట కళా సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు.
అనంతరం డీసీపీ దారా కవిత మాట్లాడుతూ పాట ఉద్యమాలను ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుందన్నారు. ప్రజలను, ఉద్యమకారులను ఏకం చేసే శక్తి పాటకు ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాట కీలక పాత్ర పోషించిందన్నారు. ఏ పోరాటంలోనైనా పాటల ద్వారా ఐక్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
జంతువులు సైతం సంగీతాన్ని ఆస్వాదిస్తాయని, కళ అనేది దేవుడు ప్రసాదించిన గొప్ప వరమని ఆమె అన్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి స్మరణార్థం ఓరుగల్లులో స్వరాభిషేకం నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ కళాకారులను అభినందించారు.
కేంద్ర ఖాదీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని అన్నారు. బండలను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందని పేర్కొన్నారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో కూడా కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం గాయకులు ఆలపించిన పాటలు సభకు వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జాతీయ ఫెడరేషన్ నాయకుడు గట్టు మహేష్‌బాబు, ఏసీపీలు ఎం. జితేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఆదర్శ లా కళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్‌తో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు.
