రెండు రోజుల వానతో చెన్నూరులో ఇళ్లకు నష్టం
అధికారుల సాయంపై బాధితుల ఆశ
చెన్నూరు ఆంధ్రప్రభ: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు చెన్నూరు పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాల ధాటికి పలుచోట్ల పాత ఇళ్ల గోడలు, పైకప్పులు దెబ్బతిని కూలిపోతుండటంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు కుండపోత వాన, మరోవైపు సొంత ఇళ్లు దెబ్బతినడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
చెన్నూరు మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు పబ్బవాడ కు చెందిన డ్రైవర్ దబ్బేట నాగరాజు ఇంటి గోడ బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిపోయింది. గోడ కూలడంతో ఇంటికి గణనీయమైన నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో కుటుంబ సభ్యులు గోడకు దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రోజువారీ కూలి, డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న నాగరాజుకు ఈ ఘటన తీవ్ర ఆర్థిక భారంగా మారింది. వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో మిగిలిన ఇల్లు కూడా ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం వెంటాడుతోందని వారు వాపోయారు.
చెన్నూరు పట్టణంలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాత భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.
