కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి..

  • సీఐటీయూ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ల గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని విమర్శించారు. దశాబ్దాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగానే పనిచేస్తూ అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఆస్పత్రులు, విద్యుత్ శాఖ, అత్యవసర వైద్య సేవలు, పంచాయతీల్లో కాంట్రాక్ట్ కార్మికులే ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, వాటర్ వర్క్స్, వీధిదీపాల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్న కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని, మహిళా కార్మికులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాల్లో పనిచేసే కార్మికులు రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ వారికి సరైన వేతనాలు అందడం లేదన్నారు.

108, 102, 104 అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్రమైన ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారని, నెలనెలా వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదని తెలిపారు. వాహనాల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉండడంతో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు.

జిల్లాలో పాల డెయిరీలు, గార్మెంట్స్, క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కార్మిక చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. గత జూన్ 30న జిల్లా యంత్రాంగం నైపుణ్యం కలిగిన, అర్థనైపుణ్యం కలిగిన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని చాలా సంస్థలు అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ధర్నా అనంతరం ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఆర్వో స్పందిస్తూ కార్మిక సంఘాలు ప్రస్తావించిన సమస్యలపై కార్మిక శాఖ అధికారులతో చర్చించి, కనీస వేతనాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందప్ప అధ్యక్షత వహించగా, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు, 108, 102 అంబులెన్స్ సిబ్బంది, సెకండ్ ఏఎన్‌ఎంలు, విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్టీసీ, ఆస్పత్రులు, మున్సిపాలిటీలు, ఇతర శాఖలకు చెందిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.