మూడో రోజూ అదే జోరు..
ఎడతెరిపి లేని వర్షాలు
వర్షాలతో చెరువులు నిండుకుండలు..
వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు
మేడిపల్లి, ఆంధ్రప్రభ : మేడిపల్లి, భీమారం మండలాల్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఎండిపోయిన పంటలకు ఊరటనిచ్చాయి. మూడో రోజు కూడా జోరుగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించడంతో వరి సాగుపై వెనకడుగు వేసిన రైతులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మళ్లీ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల ముదిరిన నారును కూడా పొలాల్లో నాటుతున్నారు.
భారీ వర్షాలతో పంటలకు కొత్త జీవం వచ్చినప్పటికీ సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలు, కూరగాయలు విక్రయించే వారు వర్షాల కారణంగా ఆటోలను అద్దెకు తీసుకుని విక్రయాలు కొనసాగిస్తున్నారు. అద్దె భారం పెరిగినా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరుకులను అందిస్తున్నామని వారు తెలిపారు.
పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో సాధారణ జీవనం కూడా ప్రభావితమవుతోంది.
అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సూచన
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి ఎస్‌ఐ మాడ శ్రీధర్ రెడ్డి సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కోరారు.
విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు రహదారులపై నిల్వ ఉన్న నీటి లోతు తెలుసుకుని మాత్రమే ప్రయాణించాలని సూచించారు. కల్వర్టులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
చేపలు పట్టడానికి, పశువులను మేపడానికి బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం సమయంలో చెట్ల కింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
