భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: సీపీ సజ్జనార్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్షాల పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్లలో ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించారు. వర్షాల కారణంగా ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నట్లు సీపీ తెలిపారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడిన వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచినట్లు వెల్లడించారు.

వర్షాల సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు వేగాన్ని తగ్గించి అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు లేదా ట్రాఫిక్ సహాయం కోసం డయల్-100ను సంప్రదించాలని సూచించారు.

నగర ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాలు, ఇతర అధికారిక వేదికల ద్వారా విడుదల చేసే ట్రాఫిక్ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వీసీ సజ్జనర్ ప్రజలను కోరారు.