Vijayawada | ఇక పూజా కార్యక్రమాలకు నేరుగా వెళ్లొచ్చు!

  • ప్రత్యేక క్యూలైన్, కొత్త ర్యాంప్ నిర్మాణానికి శ్రీకారం
  • లక్ష్మీ గణపతి ఆలయం నుంచి నేరుగా పూజా మండపాలకు ప్రవేశం
  • భక్తుల రద్దీ దృష్ట్యా మౌలిక వసతుల విస్తరణకు చర్యలు
  • ఈఓ వీకే శీనా నాయక్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, పూజా సేవలు అందించేందుకు ఆలయ యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీ సమయంలో పూజా కార్యక్రమాలకు హాజరయ్యే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్, కొత్త ర్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ తెలిపారు.

గురువారం ఆలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించిన ఈఓ, పూజా మండపాలకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. ఇకపై పూజల్లో పాల్గొనే భక్తులు ప్రధాన ఆలయం గుండా వెళ్లాల్సిన అవసరం లేకుండా, లక్ష్మీ గణపతి ఆలయం నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మీదుగా నేరుగా పూజా వేదికలకు చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి కొత్త ర్యాంప్ నిర్మాణంతో పాటు బయటకు వెళ్లే ఎగ్జిట్ మార్గాన్ని విస్తరించాలని సూచించారు. ఈ ఏర్పాట్లతో అర్చనలు, ప్రత్యేక పూజలు, ఇతర సేవల్లో పాల్గొనే భక్తులు వేగంగా, సౌకర్యవంతంగా పూజా మండపాలకు చేరుకునే అవకాశం కలుగుతుందని ఈఓ పేర్కొన్నారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మతో పాటు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.