రోడ్లపై పడిన చెట్లను తొలగించిన పోలీసులు

ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వేగంగా పునరుద్ధరించిన రాకపోకలు

జగిత్యాల, ఆంధ్రప్రభ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జగిత్యాల జిల్లా పోలీసులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను యథావిధిగా పునరుద్ధరించారు.

బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్ గ్రామంలో రహదారిపై చెట్టు కూలిపోవడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి వాహనాల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేశారు.

పెగడపల్లి–రామడుగు ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

అలాగే కొండగట్టు మండలం రాజారం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రెండు చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి చెట్లను తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు.

భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా ఇతర అడ్డంకులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.