Nara Bhuvaneshwari | మహిళల సాధికారతే కుటుంబ బలం..
స్వయం ఉపాధితో మహిళలు ఎదగాలి
మహిళలకు భువనేశ్వరి ప్రేరణాత్మక సందేశం
కుప్పంలో మహిళలకు చేయూత
స్వయం ఉపాధి పథకాలకు భువనేశ్వరి మద్దతు
Nara Bhuvaneshwari | కుప్పం, ఆంధ్రప్రభ : తెలీదు, అలవాటు లేదు, చేయలేను అనే భావనతో మహిళలు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ధైర్యంగా ముందడుగు వేసి తమ లక్ష్యాలను సాధించాలి. కుటుంబం సంతోషంగా ఉండాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

కుప్పంలో నాలుగో రోజు పర్యటనలో భాగంగా గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కొత్తపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వయం ఉపాధికి చేయూత’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భువనేశ్వరి, ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి యంత్రాలను పంపిణీ చేసి లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుప్పం ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలే తమ కుటుంబానికి నిజమైన బలమని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో తనకు 29 ఏళ్ల అనుబంధం ఉందని, ఈ కాలంలో సాధ్యమైనంత మేర ప్రజాసేవ చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే తాను వ్యాపార రంగంలో అడుగుపెట్టానని, అదే అనుభవం తనకు మహిళల సాధికారతపై మరింత అవగాహన కల్పించిందని పేర్కొన్నారు.

మహిళలు తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, కొత్త పనులను నేర్చుకోవడంలో సంకోచించవద్దని ఆమె సూచించారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ధైర్యం, కృషి, పట్టుదలతో పాటు టీమ్ వర్క్ కూడా ఎంతో అవసరమని చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కుప్పంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని భువనేశ్వరి తెలిపారు. అక్కడ శిక్షణ పొందిన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో స్త్రీ శక్తి హస్తకళా స్టార్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ స్టోర్‌లో విక్రయాల ద్వారా వచ్చే లాభాన్ని తిరిగి మహిళలకే అందిస్తున్నామని వివరించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలకు అండగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. చల్లపల్లిలోని ఎన్టీఆర్ స్కూల్ తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుందని, ఆ విద్యాసంస్థ ద్వారా అనాథ పిల్లలకు విద్య అందించడం తనకు అపారమైన సంతృప్తిని ఇస్తోందని భావోద్వేగంగా చెప్పారు. అంతకుముందు ఉదయం కుప్పంలోని హెచ్‌పీ రోడ్డులో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
తరువాత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్సర్ బాషా, వి.జి. చిన్ని నివాసాలకు వెళ్లిన భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. నాలుగో రోజు పర్యటనలో భువనేశ్వరికి స్థానిక ప్రజలు, మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ డి. సుధీర్, టీడీపీ నాయకులు పి. గోపీనాథ్, తులసినాథ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ ప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
