Farmers-Shift : పత్తీ..వర్రీ వీడి..Andhra Prabha Top Story
Farmers-Shift : పత్తీ..వర్రీ వీడి..Andhra Prabha Top Story
- అపరాల వైపు
- రైతన్న పరుగు
- తప్పని ప్రత్యామ్నాయం
- సాగర్ కాలువలకు ముందస్తు జలకళ
- అన్నదాతకు ఇదే ‘జీవధార’.

( పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ)
ఎల్‌నినో ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతలకు శుభవార్త. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ఫలితంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో, దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలకళతో శ్రీశైలం జలాశయం నిండుతుండటం, తద్వారా పల్నాడుతో పాటు ఉమ్మడి జిల్లాల లోతట్టు ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
Farmers-Shift : అన్నదాతకు ‘జీవధార..

ఎగువ నుంచి వస్తున్న ఈ వరద నీరు మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలను తాకనుంది. కృష్ణా నది ప్రవాహం ద్వారా మరో వారంలో ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాలకు భారీగా నీరు చేరుతుంది. మేళ్లచెరువు, మట్టంపల్లి సరిహద్దుల నుండి జగ్గయ్యపేట మీదుగా మాచర్ల, అమరావతి మండలాల లోతట్టు ప్రాంతాలకు ఈ వరద నీరు ఉధృతంగా ప్రవేశించనుంది. ఈ వరద ప్రవాహాలు పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కాలువలకు కూడా జీవం పోయనున్నాయి, దీనివల్ల ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీటి అందే అవకాశం ఉంది.
Farmers-Shift : ఎల్‌నినో కష్టాలకు చెక్
ఈ ఏడాది ‘ఎల్‌నినో’ తీవ్రత కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమై, పంటలు ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని రైతులు ఆందోళన చెందారు. అయితే, ఇప్పుడు లభించనున్న ఈ నీరు ఎల్‌నినో సృష్టించిన వర్షాభావ పరిస్థితులను తుడిచిపెట్టనుంది. పత్తి సాగులో పెట్టుబడి, నీటి అవసరం దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటి లభ్యతతో ప్రత్యామ్నాయంగా కంది, మినుము, పెసర వంటి స్వల్పకాలిక పంటలకు ఊతం లభించనుంది. జొన్న, మొక్కజొన్న ప్రధాన పంటలతో పాటు కందిని అంతర పంటగా సాగు చేసే రైతులకు ఈ వరద నీరు అదనపు ఆదాయాన్ని ఇవ్వనుంది. టీబీజీ-59, ఎల్‌ఆర్‌జీ-52 వంటి రకాలకు ఈ నీరు పుష్కలంగా అందుతుంది. వర్షాధారంగా సాగు చేసే మెట్ట ప్రాంతాల్లోని బావులకు పునరుజ్జీవం కలగడం ద్వారా అపరాలు, సజ్జల సాగుకు మార్గం సుగమం అవుతుంది. నీటి భద్రత ఉండటంతో పత్తి స్థానంలో లాభసాటి పంటలు సాగు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగే అవకాశం ఉంది.
Farmers-Shift : ప్రత్యామ్నాయ సాగు…

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమైంది. జులై నెల ముగుస్తున్నా వర్షాలు లేక హలం ముందుకు కదలలేదు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల ఎంపిక కీలకం. తక్కువ నీటి అవసరంతో స్వల్పకాలంలో చేతికిందే పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో 86,305 హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. జూన్, జులైలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు 27,450 ఎకరాల్లో విత్తనం వేశారు. వర్షాలులేక పంట ఎదుగుదల లేదు. పత్తికి పెట్టుబడి ఎక్కువ. ఎల్‌నినో ప్రభావంతో నష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈ పంటకు ప్రత్యామ్నాయంగా కంది, మినుము, పెసర వంటివి సాగు చేయాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వీటికి పెట్టుబడి తక్కువ, త్వరగా చేతికి వస్తుంది. టీబీజీ-59, ఎల్‌ఆర్‌జీ-52 పంట కంది రకాలు సాగు చేస్తే రెండు తడులు నీరు పెట్టినా దిగుబడి వస్తుంది. పరిస్థితులను బట్టి సెప్టెంబరులో విత్తుకోవచ్చు. జిల్లాలోని మెట్ట భూములకు బావులే ఆధారం. ఈ భూముల్లో మొక్కజొన్న, పులశనగ, అపరాలు, సజ్జలు సాగు చేస్తున్నారు. జొన్న పంట వేగంగా చేతికి వస్తుంది. ఎన్టీజే-5తోపాటు దేశవాళీ జొన్న రకాలు వంద రోజుల్లోనే కోతకు వస్తాయి. అక్టోబరులో పంట వేసినా ఇబ్బంది లేదు. ఎకరానికి 7 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అంతర పంట వేస్తే రెండు విధాల లాభం ఉంటుంది. నాలుగు వరుసల్లో మొక్కజొన్న విత్తనాలు వేస్తే.. ఒక వరుసలో కంది అంతర పంటగా వేయాలి. ఇలాచేస్తే ఎకరానికి మొక్కజొన్న 25-30 క్వింటాళ్లు, కంది 6-8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
సహజంగా వరద అంటేనే నష్టాలన్న భయం రైతుల్లో ఉంటుంది. కానీ, ఈసారి ఈ జలరాశి ఎల్‌నినో దెబ్బకు కుదేలైన రైతును బతికించే ‘అమృతధార’గా మారింది. అధికారులు క్షేత్రస్థాయిలో నీటి నిర్వహణను పర్యవేక్షిస్తూ, అప్రమత్తంగా ఉంటే, ఈ ఖరీఫ్ సీజన్ పల్నాడు రైతులకు సంక్షోభం నుంచి సంపద వైపు బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ప్రకృతి ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటేనే రైతు పంట పండుతుంది.
