సమాన అవకాశాలే క్రీడా అభివృద్ధికి పునాది..

  • అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు ప్రతీకగా నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులు, క్రీడాభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్పెష‌ల్ డే (ఒలింపిక్ దినోత్సవాన్ని) స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వ భావాలను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు, లింగం, వయసు, సామర్థ్యాల పరంగా ఎలాంటి వివక్ష లేకుండా క్రీడారంగంలో సమాన అవకాశాలు కల్పించే వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఐక్యత, శాంతికి ప్రతీకగా నిలిచే ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి క్రీడాకారుడు ఆచరణలో పెట్టాలని సీఎం సూచించారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగాలని, అలుపెరగని ప్రయత్నమే విజయానికి పునాది అని పేర్కొన్నారు. క్రీడా రంగంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ప్రేరణగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.