భారీ వర్షాలకు రోడ్లపై కూలిన వృక్షాలు

బ్లూకోర్టు పోలీసుల చొరవతో ట్రాఫిక్ పునరుద్ధరణ

దండెపల్లి, ఆంధ్రప్రభ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం దండెపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న బ్లూకోర్టు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో రహదారిపై పడిన భారీ వృక్షాన్ని తొలగించారు.

పోలీసులు సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ను పూర్తిగా పునరుద్ధరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని దండెపల్లి ఎస్‌ఐ గూడేటి రాజవర్ధన్ సూచించారు.