Vissannapeta | ప్రజల వద్దకే పాలన..

Vissannapeta| ప్రజల వద్దకే పాలన..

173 అర్జీలు స్వీకరించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం

విస్సన్నపేట (Vissannapeta), ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, స్థానిక ఎమ్మెల్యే కె. శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా ఈ కార్యక్రమం దోహదపడుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, శాశ్వత పరిష్కార మార్గాలను చూపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని వివరించారు. ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం అవసరం, ఒక వ్యక్తి ఆశ ఉంటుందనే భావనతో అధికారులు స్పందించాలని సూచించారు. ప్రజల సంతృప్తే ప్రభుత్వ పనితీరుకు నిజమైన కొలమానమని గుర్తుంచుకోవాలని చెప్పారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాలకు సంబంధించిన ప్రజల నుంచి మొత్తం 173 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.

వాటిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన 94 అర్జీలు, రెవెన్యూ శాఖకు 26, ఏపీ సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘానికి 14, పంచాయతీ రాజ్ శాఖకు 10, విద్యుత్ శాఖకు 6, గృహ నిర్మాణ శాఖకు 5, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు 3, సర్వే సెటిల్‌మెంట్ మరియు భూ రికార్డుల శాఖకు 3, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖకు 3, పోలీసు శాఖకు 2, రోడ్లు-భవనాల శాఖకు 2, సాంకేతిక విద్యా శాఖకు 2 అర్జీలు అందినట్లు తెలిపారు. ఏపీ దివ్యాంగులు, వృద్ధుల సహాయ సంస్థ, మద్యనిషేధం మరియు ఎక్సైజ్ శాఖ, పాఠశాల విద్యా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ అందినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో తిరువూరు ఆర్‌డీవో ఎ. కుమార్, పీడీఆర్‌డీఏ శ్రీనివాసరావు, డీపీవో పి. లావణ్యకుమారి, డీఈవో ఎల్. చంద్రకళ, అగ్రికల్చర్ డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా అటవీ అధికారి జి. సతీష్, డ్వామా ఏపీడీ పార్థసారథి, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.