Kurnool నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
Kurnool నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
విద్యార్థులకు ప్రత్యేక బస్సులు, వైద్య సదుపాయాలు
కర్నూలు బ్యూరో (Kurnool), ఆంధ్రప్రభ: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి లోపాలకు తావులేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నీట్ పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మే నెలలో నిర్వహించిన పరీక్ష మాదిరిగానే జూన్ 21న కూడా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, గతంలో ఉన్న ఒక కేంద్రాన్ని మార్చి కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం, తగిన గాలి, వెలుతురు, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించుకుని, అన్ని తనిఖీలు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 1:30 గంటలలోపు పరీక్షా హాలులోకి చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష రోజున విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌కో ఈఈ విజయభాస్కర్‌ను ఆదేశించారు.
ప్రతి కేంద్రంలో ఒక ఏఎన్‌ఎంతో పాటు ఓఆర్‌ఎస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, అవసరమైన మందులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్‌కు సూచించారు. అవసరమైన మేరకు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, దివ్యాంగ విద్యార్థులకు వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సంబంధిత వైద్యుల ఫోన్ నంబర్లను పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు అందజేయాలని చెప్పారు.
వర్షాకాలం నేపథ్యంలో పరీక్షా కేంద్రాల బయట తాత్కాలిక వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని నీట్ కోఆర్డినేటర్ పాయల్ ప్రియదర్శినికి సూచించారు. జిల్లాలో 4,928 మంది విద్యార్థులు 16 కేంద్రాల్లో పరీక్ష రాస్తుండటంతో వారి సౌకర్యార్థం ఉదయం 11:30 గంటల నుంచి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ‘నీట్ పరీక్ష స్పెషల్’ బస్సులను నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణికి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, పరీక్ష రోజున కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రశ్నాపత్రాల తరలింపునకు కూడా ప్రత్యేక బందోబస్తు కల్పిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల తనిఖీ ప్రాంతాలు, పరీక్షా హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ సమావేశంలో నీట్ పరీక్ష కోఆర్డినేటర్లు పాయల్ ప్రియదర్శిని, డాక్టర్ కే. సత్యబాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్, డీసీ లేబర్ వెంకటేశ్వర్లు, కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్, అర్బన్ తహసీల్దార్ రవి, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
