గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కృతజ్ఞత సభ..

గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కృతజ్ఞత సభ..

విజయవాడలో జోన్-2 సమావేశం
ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలో జోన్-2 పరిధిలోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కృతజ్ఞత సభ ఘనంగా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గత 20 నెలలుగా సేవలందిస్తున్న కార్యదర్శుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో “థాంక్యూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్” అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బగ్గా జగదీష్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థలో కార్యదర్శుల కృషి వల్ల శాఖ రికార్డు స్థాయి విజయాలు సాధించిందన్నారు.

ముఖ్యంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా సుమారు 1.70 కోట్ల ఆస్తుల రికార్డులను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జీరో ఫిజికల్ కరెన్సీ (డిజిటల్ పేమెంట్స్) విధానం అమలు చేసి సుమారు రూ.1000 కోట్లకు పైగా ఇంటి పన్ను వసూలు చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం వల్ల ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో 85 శాతం పాజిటివ్ స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.91పై కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ జీవో ద్వారా 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రేడ్-4, గ్రేడ్-5 కార్యదర్శులను పీడీఓ గ్రేడ్-3గా హోదా మార్పు చేసి, పే స్కేల్‌ను రూ.25,220 నుంచి రూ.28,280కి పెంచడం ప్రోత్సాహకమని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలో రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని సన్మానించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లావణ్య, గోపాలకృష్ణ, శేషు, కిషోర్, శ్రీనివాసరావు, చైతన్య, శివచైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ జేఏసీ తరఫున అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్, మనోజ్ హాజరయ్యారు.

Leave a Reply