‘నీట్ ‘కు 98.69 శాతం హాజరు…
‘నీట్ ‘కు 98.69 శాతం హాజరు…
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 32 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 11,496 మంది అభ్యర్థులకు 11,345 మంది (98.69 శాతం) హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ పరీక్ష ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కొండపల్లిలోని జడ్పీ బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష ముగిసిన అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరిగిందని, అభ్యర్థుల ధ్రువీకరణ, బయోమెట్రిక్ హాజరు, భద్రత.. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూశామన్నారు. వేసవి నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీటితో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష విజయవంతానికి కృషి చేసిన నీట్ కో – ఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో పాటు రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్, ప్రజా రవాణా తదితర సమన్వయ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో 1021 మంది హాజరు..
కొండపల్లి పట్టణ, ఇబ్రహీంపట్నం మండల పరిధిలో నీట్ పరీక్షకు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొండపల్లి జడ్పీ బాలికల హైస్కూల్ లో 240 మంది అభ్యర్థులకు 238 మంది హాజరయ్యారు. జడ్పీ బాలుర హైస్కూల్ లో 240 మందికి 236 మంది పరీక్ష రాశారు. గుంటుపల్లి కేంద్రీయ విద్యాలయం – 2లో 360 మందికి 356 మంది, గుంటుపల్లి జడ్పీ హైస్కూల్ లో 192 మందికి 191 మంది పరీక్ష రాశారు.
