యోగా సాధనతో జీవన విధానంలో అద్భుతమైన ఫలితాలు..

కృష్ణా జిల్లాలో యోగా శిక్షణ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శం.
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్య నారాయణ రాజు.

పామర్రు – ఆంధ్రప్రభ : యోగ సాధనతో ప్రజల జీవన విధానంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పామర్రు ప్రగతి జూనియర్ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వారం రోజుల యోగా శిక్షణా కార్యక్రమంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ, యోగ ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన వరమని అన్నారు. ఒకప్పుడు యోగాకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా, ఇటీవల ప్రజలు యోగ సాధన ద్వారా పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి తిరిగి యోగాపై ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు. ఋషులు, మునులు అందించిన యోగమార్గాన్ని అనుసరిస్తూ ఎంతో మంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పారు.

విద్యార్థులకు బాల్యం నుంచే యోగ శిక్షణ అందిస్తే వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెరిగి జీవితంలో ఉన్నత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు. యోగ సాధనతో పాటు సరైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, తప్పుడు జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, యోగ సాధనకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులకు వారం రోజుల యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత జిల్లా కలెక్టర్ డీకే బాలాజికి దక్కుతుందని ప్రశంసించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృష్ణా జిల్లా విద్యాశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనుభవజ్ఞులైన యోగా గురువుల ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న శిక్షణను ఆయన అభినందించారు.

ప్రతి పాఠశాలలో నిత్యం 20 నిమిషాలు యోగా తప్పనిసరి.!

జిల్లా కలెక్టర్.

కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం కనీసం 20 నిమిషాల పాటు విద్యార్థులకు యోగాభ్యాసం నిర్వహించాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. యోగా నిర్వహించిన ఫొటోలను ప్రతిరోజూ జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించాలని ఆదేశించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ముగింపులో యోగా గురువులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు, ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి, నాగార్జున విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, జాతీయ అథ్లెట్ కార్తీక్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి, ప్రగతి జూనియర్ కళాశాల అధినేత సనకా పూర్ణచంద్రరావు, యోగా గురువులు శాస్త్రి, లీలావతి, ప్రసన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.