Bhimavaram ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం..
Bhimavaram ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం..
పీజీఆర్ఎస్‌లో 104 అర్జీలు స్వీకరణ
భీమవరం (Bhimavaram), ఆంధ్రప్రభ: ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా, భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకసారి వచ్చిన అర్జీని నాణ్యతతో పరిష్కరించడం ద్వారా అదే సమస్యపై అర్జీదారుడు మళ్లీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా చూడటమే ప్రత్యేక పీజీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమం ద్వారా ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను స్వీకరిస్తున్నారని చెప్పారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.
నేటి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 104 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో భీమవరం అర్బన్ నుంచి 36, భీమవరం రూరల్ నుంచి 30, వీరవాసరం మండలం నుంచి 38 అర్జీలు అందినట్లు వివరించారు. ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రేషన్ కార్డులు, భూమి రీ-సర్వే, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చినట్లు తెలిపారు.
అర్జీలను పరిశీలించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముగింపు చేయరాదని అధికారులను ఆదేశించారు. సేవాభావంతో, సానుకూల దృక్పథంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తమ పరిధిలో లేని అంశాలపై అర్జీదారులకు స్పష్టమైన సమాచారం అందించి, అవసరమైతే ప్రభుత్వానికి నివేదించాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జూన్ 12 వరకు భీమవరం నియోజకవర్గంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ ద్వారా 7,669 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో 6,678 దరఖాస్తులు పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలకు క్షేత్రస్థాయిలో వేగవంతమైన, నాణ్యమైన పరిష్కారం అందించే అవకాశం కలుగుతోందన్నారు. అందిన ప్రతి అర్జీని అధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. నేడు స్వీకరించిన అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలతో తదుపరి సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభుత్వ భూమి కేటాయింపు కోసం, భీమవరం పట్టణానికి చెందిన మహిళ భూమి రీ-సర్వే కోసం, అగ్నిప్రమాదంలో ఆధార్ కార్డులు కోల్పోయిన కుటుంబం తిరిగి ఆధార్ కార్డుల జారీ కోసం, విద్యుత్ స్తంభం పునరుద్ధరణ, వృద్ధాప్య పింఛన్ల మంజూరు తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎ. అప్పారావు, మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై. దోసిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
