విధులకు వెళ్తుండగా విషాదం…
పాలకుర్తి, ఆంధ్రప్రభ : ఉదయాన్నే కుటుంబ సభ్యులకు “డ్యూటీకి వెళ్లి వస్తా” అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఓ కార్మికుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో రామారావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ ఉద్యోగి దుర్గం మల్లయ్య (55) శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ప్రతి రోజులాగే మొదటి షిఫ్ట్ విధులకు వెళ్లేందుకు బయలుదేరిన మల్లయ్యను ధర్మారం ఎక్స్‌రోడ్డు నుంచి పుట్నూరు వైపు వెళ్తున్న లారీ రామారావుపల్లి గ్రామ సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబానికి అండగా నిలిచిన మల్లయ్య ఆకస్మిక మృతితో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కుటుంబానికి అండగా యూనియన్..
ఈ విషయం తెలిసిన వెంటనే అల్ట్రాటెక్ పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షులు మల్క రామస్వామి, జనరల్ సెక్రటరీ రమేష్ మోరియా తోటి కార్మికులతో కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మల్లయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద రూ.20 లక్షలు, ఈపీఎఫ్‌తో పాటు ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మల్లయ్య భార్యకు నెలకు రూ.3 వేల ఫించన్, అంత్యక్రియల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం యాజమాన్యం అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే మల్లయ్య కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యూనియన్ యూనియన్ ముందుకు రావడం కొంత ఊరటనిచ్చినా, మల్లయ్య లేని లోటు మాత్రం తీరనిదేనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
